Online Puja Services

ఆకాశగంగ మహత్యం గురించి విన్నారా ?

13.59.34.87

ఆకాశగంగ మహత్యం గురించి విన్నారా ? 
-లక్ష్మీ రమణ 

తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళినవారు కొండమీద ఆకాశగంగా తీర్థాన్ని తప్పక దర్శించునే ఉంటారు.  శ్రీనివాసుని వివాహానికి ఈ ఆకాశగంగ లోనే విందుని వండి వడ్డించారని శ్రీనివాసకల్యాణ కావ్యం చెబుతోంది.  ఆకాశ గంగా తీర్థం గురించి శ్రీనివాసుడు ఏం చెప్పారనేది ఆశక్తి కరమైన విషయం. ఈ తీర్థాన్ని గురించి స్వయంగా శ్రీనివాసుడు స్కాంద పురాణంలో రామానుజునికి తెలియజేశారు . ఆ కథా వైభవాన్ని చెప్పుకుంటూ, రామానుజులు చేసిన శ్రీనివాస దర్శనాన్ని ఈ అక్షరాలలో మనమూ దర్శిద్దాం . 

  పూర్వము వెంకటాద్రి మీద నెలకొన్న ఆకాశగంగ తీర్థం దగ్గర పరమ విష్ణు భక్తుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ధర్మాత్ముడు అయిన రామానుజుడు అనే వైఖానస విప్రుడు నివసిస్తూ ఉండేవాడు.  ఆ ధర్మాత్ముడు ఎండాకాలంలో పంచాజ్ఞుల మధ్య నిలబడి, హేమంత ఋతువుల్లో సరోవరలో నిలబడి తపస్సు చేసేవాడు.  నిరంతరం తదేక దీక్షతో శ్రీమన్నారాయణని అష్టాక్షరి మంత్రాన్ని ధ్యానిస్తూ, కొంతకాలం పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ , మరి కొంతకాలం నిరాహారంగా ఉంటూ శ్రీహరి దర్శనం కోసం పరితపిస్తూ ఉండేవాడు. 

రామానుజుడు చేసిన తీవ్రమైన తపస్సు శ్రీనివాసుని కదిలించింది.  భక్త వాత్సల్యం కలిగిన స్వామి, శంఖ, చక్ర, గదా, బాణాలను ధరించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు.  వికసించిన తామరల వంటి కళ్ళు కలిగిన వాడు, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడు, గరుడునిపై విహరించే వాడు, ఛత్ర చామరాల చేత సేవలు పొందేవాడు, కేయూరాలు, హారాలు కిరీటము వంటి వాటి చేత అలంకరించబడినవాడు, విశ్వక్సేనుడు, సునందుడు వంటి వారి చేత సేవలు అందుకునేటటువంటి శ్రీనివాసుడు ఆయన. వేణువు, వీణ, మృదంగం లాంటి వాయిద్యాలను వాయిస్తూ నారదాది మునులు అందరిచత కీర్తించబడుతున్నటువంటి న విష్ణుమూర్తి.  పచ్చటి పట్టు పీదాంబరాలు ధరించిన వాడు.  వక్షస్థల మీద లక్ష్మీదేవిని నిలుపుకున్నవాడు.  నీల మేఘం వంటి శరీరఛాయని కలిగిన వాడు. సనక సనందాది  యోగుల చేత స్తుతించబడేవాడు.  తన చిరునవ్వుతో ముల్లోకాలనీ మోహింప చేసేవాడు.  పది దిక్కులను తన శరీర కాంతితో ప్రకాశింపజేసేవాడు.  భక్తసులభుడు, దేవదేవుడు ఆ వెంకటేశ్వరుడు. ఇలా  దయానిధి అయిన శ్రీనివాసుడు సర్వాంగ సుందరుడై రామానుజుడికి దర్శనమిచ్చాడు. 

 జగన్మోహన కారుడైన శ్రీనివాసుడి దర్శనంతో రామానుజుడు పులకించిపోయారు.  తన్మయత్వంతో స్వామిని మధురంగా కీర్తించారు.  జగద్గురు వైన శ్రీనివాసుని అనేక విధాలుగా స్తుతించి, ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు.  రామానుజుని స్తుతి విన్నటువంటి శ్రీనివాసుడు ఎంతో ఆనందించారు.  తన నాలుగు చేతులతోటి ఆయనని మనసారా కౌగిలించుకుని, “ఓ రామానుజా ! నీ తపస్సుకి, నీ స్తోత్రానికి నేనేంతో సంతోషించాను.  నీకేం వరం కావాలో కోరుకో” అని అనుగ్రహించారు. 

 శ్రీనివాసుని కరుణకి పులకించిపోయినటువంటి రామానుజుడు “ఓ పరంధామా! పరాత్పరా! నీ దివ్య దర్శనంతో నా జన్మ ధన్యం అయింది.  హరిహర బ్రహ్మాదులు సైతం ఎవరిని తెలుసుకోలేరో, ఎవరి గుణగణాల్ని వర్ణించలేరో  అటువంటి నిన్ను కళ్ళారా చూడగలిగాను.  నాకు అంతకన్నా గొప్ప వరం ఇంకా ఏముంటుంది? ఎవరి దివ్య నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే, సకల పాపాలు నశించిపోతాయో, అలాంటి శ్రీనివాసుని నేను దర్శనం చేసుకున్నాను. స్వామీ  నా జన్మ ధన్యమైంది.  స్వామి నీ పాద  పద్మాల మీద నాకు నిశ్చలమైన భక్తి ఉండేలా దీవించు ఇది ఒక్కటే నేను కోరే వరం” అని అడిగారు.  

రామానుజుడి నిష్కళంకమైనటువంటి భక్తికి మెచ్చుకున్న శ్రీనివాసుడు “రామానుజా! నువ్వు కోరినట్టే నీకు నామీద దృఢమైన భక్తి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహిస్తున్నాను. మరో విషయం చెబుతున్నాను విను సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు, పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఆకాశగంగలో స్నానం చేసే మానవుడు పునరావృత్తి లేని వైకుంఠ దివ్యధామాన్ని  చేరుకుంటాడు.  నువ్వు ఇక్కడే నివసించు.  ఈ జన్మ అయిపోయిన తర్వాత నీవు సరాసరి నా లోకానికి వస్తావు . ఇక్కడ స్నానం చేసిన వారంతా పరమ భాగవతోత్తములు.”  అని చెప్పారు. 

కనుక ఆకాశ గంగా స్నానం అంతటి మహత్తరమైనది . విశేషించి పైన చెప్పుకున్నటువంటి రోజుల్లో ఆకాశగంగ ఒక్క చుక్క నెత్తిన జల్లుకున్నా అది మనని ఆ పురుషోత్తముని దివ్య చరణ సన్నిధికి చేరుస్తుంది. ఈ సారి తిరుమల వెళ్లేప్పుడు ఈ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా మీ ప్రయాణాన్ని ముహూర్తానికి అనుకూలంగా మార్చుకోండి .  శ్రీవారి అనుగ్రహాన్ని అందుకోండి . 

శుభం . 

Akasa Ganga, Akasha Ganga, Tirumala, Sri Venkateswara Swami, Balaji, Govinda, Srinivasa

#akasaganga

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore